Wednesday, June 1, 2016

ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవుల సంతతి సంరక్షణ, ఏపీ ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ఎంఓయూ భేటి...!!!


ఒంగోలు గిత్తలు, పుంగనూరు ఆవుల సంతతి సంరక్షణ
ఏపీ ప్రభుత్వంతో యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ఎంఓయూ
మిల్క్ మిషన్ ప్రాజెక్టు బృందంతో  సీఎం చంద్రబాబు భేటీ
విజయవాడ, జూన్ 1:  ప్రపంచంలోనే విశిష్టమైన ఒంగోలు జాతిగిత్తలు, పుంగనూరు ఆవుల సంతతిని భావితరాలకు అందించాల్సిన కర్తవ్యం తమమీద ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
బుధవారం సీఎంఓలో యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా నుంచి వచ్చిన ‘మిల్క్ మిషన్’ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన వారికి వివరించారు.  ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ అనుబంధ రంగాలు వృద్ధి చోదక శక్తులుగా ఉన్నాయని, అధికాదాయం వస్తోందని చెప్పారు. అందువల్ల పాడిపరిశ్రమ అభివృద్ధికి,  పశుగణాభివృద్ధిపై ప్రత్యకంగా దృష్టి పెట్టినట్లు ముఖ్యమంత్రి వివరించారు.  నాలుగు లీటర్లకంటే తక్కువ పాలు ఇచ్చే పశుసంతతిలో  పాల దిగుబడి శాతం పెంచడానికి దశాబ్దాలుగా ప్రయత్నించినా పూర్తిస్థాయి ఫలితాలు రావటం లేదని వివరించారు. విదేశాల్లో అమలులో ఉన్న  కృత్రిమ గర్భోత్పత్తి (ఆర్టిఫీషియల్ ఇన్‌సెమినేషన్) విధానాలను తమ రాష్ట్రంలో అవలంబిస్తుంటే ఫలితాలు యాభై శాతానికి మించి రావటం లేదన్నారు. 
అయితే ఐవీఎఫ్ విధానంలో పుట్టిన  పశు సంతతిలో 60% పశువులు 8 నుంచి 10 లీటర్ల వరకు పాలిచ్చే సామర్ధ్యం పెరిగిందన్నారు. ఏపీలో  స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువుగా రోజుకు 20 లీటర్లకు పైగా పాలిచ్చే పశుసంతతి ఉందని తెలిపారు. 
మేలుజాతి జన్యు సంతతిని వేగవంతంగా పెంచడానికి కృషి
  ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవిఎఫ్) పద్ధతిని ఉపయోగించటం ద్వారా సాధ్యమైనంత తక్కువ సమయంలో మేలుజాతి పశుసంతతిని అభివృద్ధి సాధ్యమవుతుందని,  కృత్రిమ గర్భోతత్తిలో ఇప్పటి వరకు సంప్రదాయ పద్ధతులలో ఒక రైతు తన పశువుల నుంచి  6 పెయ్యదూడలను పొందగలిగితే, నూతన ఎంబ్రియో ట్రాన్స్ ఫర్ టెక్నాలజీని, ఐవీఎఫ్ టెక్నిక్ లను సమ్మిళితం చేసి ఉపయోగిస్తే 200 నుంచి 250 పెయ్యదూడలను పొందే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రికి పెనిసిల్వేనియా ప్రతినిధులు వివరించారు. ఈ ఆధునిక కృత్రిమ గర్భోత్పత్తి విధానాల ద్వారా వచ్చే ఐదేళ్లలో రాష్ట్రావసరాలకు అనుగుణంగా 10 వేల మేలుజాతి పశువులను ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
పశువులకు పోషకాహారం
  రుమెన్ మైక్రోబియల్ జీనోమ్ టెక్నాలజీ ద్వారా తక్కువ వ్యయంతో ఎక్కువ పోషకాలు కలిగిన గ్రాసాన్ని పశువులకు అందించే వీలుంటుంది యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ  తాజాగా కనుగొన్న  ఫీడింగ్ మెథడ్స్,  ప్రోబయోటిక్స్ విధానాల వల్ల రైతుకు ఆర్ధికంగా  మేలు జరిగేలా చూడాలన్నారు.

  ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజర్ల ద్వారా మన పాడి ఉత్పత్తులకు మార్కెటింగ్, బ్రాండింగ్ అంశాలలో అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టు సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదిలా ఉంటే  యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా ప్రతినిధి బృందం మిల్క్ మిషన్ ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో మన అభ్యుదయ రైతులు, పశువైద్యులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలకు ఈ ప్రాజెక్టు ద్వారా శిక్షణ అందనుంది.
కొత్తగా కుదుర్చుకుంటున్న ఎంఓయూలతో ప్రయోజనాలు
మిల్క్ మిషన్ ఒప్పందంవల్ల ఆంధ్రప్రదేశ్ లో రైతాంగానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పాడి ఉత్పత్తి పెరుగుదల, ఉత్పత్తి వ్యయం తగ్గించటం,లాభాలను పెంచటానికి తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఈ రంగంలో రెండంకెల వృద్ధికి దోహదం  చేస్తుందని అన్నారు.  సమావేశంలో సీఎంఓ సహాయ కార్యదర్శి శ్రీ అడుసుమల్లి రాజమౌళి, యూనివర్శిటీ ఆఫ్ పెనిసిల్వేనియా మిల్క్ మిషన్ ప్రాజెక్టు ప్రతినిధులు, సీనియర్ ప్రొఫెసర్  డా. డేవిడ్ గ్యాలగన్,  అసిస్టెంట్ ప్రొఫెసర్ దీప్తి పిట్టా, డైరెక్టర్ డాక్టర్ విక్టర్ అబ్సలోన్ మెడినా తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment