Wednesday, June 1, 2016

మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలను మీడియాకు వివరించిన 'పల్లె '

విజయవాడ:  బుధవారం జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి విజయవాడలో సమావేశం  అనంతరం సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కేబినెట్ లో తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు :

•   ఈ నెల 8న ఒంగోలులో మహాసంకల్ప సభ నిర్వహణకు ఏపీ కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు
•  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరిట ఏపీలో ప్రారంభమైన 'చంద్రన్న బీమా' పథకం విధివిధానాలకు ఏపీ సర్కారు ఆమోదం తెలిపిందని మంత్రి అన్నారు. ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుందని, ఇది పేదలకు వరప్రసాదం వంటిదని ఆయన అన్నారు. అంగవైకల్యానికి రూ. 3,62,500 వరకూ డబ్బు చేతికి అందుతుందని అన్నారు. సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు, ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు అందుతుందని వివరించారు. 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ పథకాన్ని చంద్రబాబు నాయకత్వంలో రూపొందించినట్టు తెలిపారు. ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వివరించారు.
•  జూన్ 10 నుంచి 20 వరకూ ఉద్యోగుల బదిలీలుంటాయన్నారు
•  మొత్తం 10వేల పోస్టులను మొదటి దశలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు
•  కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలపై సోషియో ఎకనమిక్ డేటా సర్వే నిర్వహిస్తామన్నారు
•  జూన్ 20 నుంచి 30 వరకు, వచ్చే నెల 5 నుంచి 30 వరకు పల్స్ సర్వే జరుపుతామన్నారు
•  ప్రభుత్వోద్యోగాల కోసం కోటి ఆశ‌ల‌తో ఎదురుచూస్తోన్న‌ నిరుద్యోగుల‌కు త్వర‌లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపిక‌బురు అందించ‌నుందని మంత్రి వెల్లడించారు. ఉద్యోగాల జాతర ఇక మొద‌లు కానుంద‌ని చెప్పారు.
•  పోలీస్ మినహా అన్ని జాబ్ లు ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు
•  త్వరలో గ్రూప్ -1, గ్రూప్-2, గ్రూప్ -3 నోటిఫికేషన్లు వెలువడనున్నాయని అందులో భాగంగా గ్రూప్-1లో 94, గ్రూప్-2లో 750, గ్రూప్-3లో వెయ్యి పోస్టులు ఉండనున్నాయన్నారు
•  అత్యధికంగా పోలీస్ శాఖలో 6వేల ఉద్యోగాలకు ప్రకటన వెలువడనుందని తెలిపారు
•  ప్రభుత్వ ఎయిడెడ్ , మున్సిపల్ పాఠశాల విద్యార్థులందరికీ సైకిళ్లను పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

No comments:

Post a Comment