Friday, June 3, 2016

పట్టుదలతో శ్రమిస్తే ఫలితాలు, నవ నిర్మాణ దీక్షపై సీయం టెలికాన్ఫరెన్స్...!!!

‘చరిత్రలో ఒక మలుపులో ఉన్నాం, నిర్లక్ష్యం చేస్తే వెనక్కిపోతాం, పట్టుబట్టి ముందుకు వెళ్తే ఊహించని ఫలితాలు సాధిస్తాం’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలోని తన నివాసం నుంచి 5,600 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బందితో శుక్రవారం ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. విభజన వల్ల జరిగిన నష్టాన్ని కష్టంతో అధిగమిద్దామని, రాష్ట్రాన్ని విడదీసిన  వాళ్లే విస్తుపోయేలా అభివృద్ది సాధిద్దామని ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారు.

విభజన అసమానంగా జరిగిందంటూ, ఆదాయం 47%, జనాభా 58% రావడంతో మొదటి రెండేళ్లు ఆర్దికంగా అనేక కష్టాలు ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి  వివరించారు. తొలి ఏడాదిలో రూ.16 వేల కోట్ల రెవిన్యూలోటు వస్తే కేంద్రం రూ. 2,300 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. 9, 10 షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థలు, కంపెనీల విభజన రెండేళ్లు గడిచినా పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో పొరుగు రాష్ట్రంతో సమస్యలు తలెత్తుతున్నాయని, త్వరితగతిన దీనిని పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉన్నదని అన్నారు.
2019-20 నాటికి ఈశాన్య రాష్ట్రాలకన్నా ఆంధ్రప్రదేశ్‌కే ఆర్ధికలోటు ఎక్కువగా  ఉంటుందని 14వ ఆర్ధిక సంఘం పేర్కొన్న విషయం ముఖ్యమంత్రి ప్రస్తావించారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లో నగరీకరణ తక్కువగా ఉన్నందువల్ల ఆదాయంలో వెనుకంజలో ఉన్నామన్నారు.  గత రెండేళ్లలో ఆదాయం 3% పెంచామని, జాతీయ స్థాయికన్నా వృద్దిలో 3% ముందంజలో ఉన్నామని, మరింతగా మనం నిలదొక్కుకోవాలంటే ఇదే స్పూర్తితో రాబోయే మూడేళ్లు పనిచేయాలని, అప్పుడే  అనుకున్న ఫలితాలు సాధిస్తామని చెప్పారు.

నవ నిర్మాణ దీక్షలో పాల్గొని అందరికీ స్పూర్తినిచ్చిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలకు సీయం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ స్ఫూర్తిని కడదాకా కొనసాగించాలని, రాబోయేకాలంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో, ప్రపంచంలో సమున్నతంగా నిలపాలని మార్గదర్శనం చేశారు. 

తలసరి ఆదాయంలో పొరుగు రాష్ట్రాలకన్నా వెనుకబడి ఉన్నామంటూ, ఆంధ్రప్రదేశ్‌కు రూ. 1,03,000 తలసరి  ఆదాయం ఉంటే, తెలంగాణలో రూ,1,38,000, కర్ణాటకలో రూ.1,40,000 తలసరి  ఆదాయం ఉన్న విషయం గుర్తుచేశారు. వాటితో సమాన స్థాయికి చేరేదాకా ఆంధ్రప్రదేశ్‌కు సహకరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అప్పటి వరకూ ఎవరూ విశ్రమించరాదన్నారు. నవ నిర్మాణ దీక్షాదినం నుంచి మహా సంకల్పం వరకు ఈ వారం రోజులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు విజయవంతం చేయాలని, ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. వివిధ రంగాలలో నిష్ణాతులచే ప్రసంగాలు ఇప్పించాలని, వినూత్న ఆలోచనలకు, ఆవిష్కరణలకు నాందిపలికేలా చర్చలు జరపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

No comments:

Post a Comment