రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అభినందిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నవనిర్మాణ దీక్ష మూడోరోజు అయిన శనివారం ఉదయం గుంటూరు జిల్లా ఉండవల్లి లోని తన నివాసం నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సంక్షేమంపై ప్రజల్లో 80% సంతృప్తి, సంతోషం ప్రజల్లో కనిపించాలనే లక్ష్యంతో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటికో ఇంకుడుగుంత, పొలానికో పంటకుంట, ఊరికో వనం...కార్యక్రమాలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రతి నియోజకవర్గంలో 1000 మొక్కలు నాటాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిన పంచాయితీలకు, స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.
బహిరంగ విసర్జన రహిత గ్రామాలకు రూ.5 లక్షలు, వంద పంటకుంటలు తవ్విన గ్రామాలకు రూ.4 లక్షలు, ఇంటికో ఇంకుడు గుంత సాధించిన గ్రామానికి రూ.2 లక్షలు, 50 వర్మి కంపోస్టు యూనిట్లు మహిళా సంఘాలు నెలకొల్పితే రూ.2 లక్షలు, మూడు కి.మీ. పొడవునా, లేదా 1200 మొక్కలు నాటి పెంచితే రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహకం ఇస్తామని చెప్పారు.
గ్రామంలో నాలుగు ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటి వాటిని పెంచితే రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహకం ఇస్తామన్నారు. సంక్షేమ పథకాల వల్ల ఆయా కుటుంబాలకు కలిగిన ప్రయోజనాలు, వాటిద్వారా వచ్చిన ఫలితాలపై లబ్దిదారులతో నవనిర్మాణ దీక్ష సభల్లో మాట్లాడించాలని చంద్రబాబు సూచించారు. రూ.1000 పింఛను వల్ల తన కుటుంబానికి ఎంత సంతృప్తి వచ్చిందో, రేషన్ బియ్యం 4 కిలోలనుంచి 5 కిలోలకు పెంచి ఆంక్షలు లేకుండా కార్డులో పేర్లున్న అందరికీ సరఫరా చేయడంవల్ల ఆకుటుంబానికి ఎంతమేలు కలిగిందో వివరించాలన్నారు. పొలంలో తవ్విన పంటకుంటలోకి నీరు చేరడంవల్ల ఎంత సంతృప్తి వచ్చిందో సదరు లబ్దిదారులతోనే ఆయా సభల్లో మాట్లాడిస్తే మిగిలినవారికి స్ఫూర్తిదాయకం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వ పథకాలపై సమగ్రంగా చర్చిస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాలని, అమలు తీరును విశ్లేషించాలని సూచించారు.
మరింత చర్చ జరగాలి
‘2014 జూన్ 4న మన పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? రెండేళ్లలో ఎంత సాధించాం? ఇంకా సాధించాల్సింది ఎంత ఉంది? ఇత్యాది అంశాలపై సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు చర్చించాలి, భవిష్యత్తు దిశానిర్దేశం చేసుకోవాలి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలు సమన్వయంగా పనిచేయాలని కోరారు. రాబోయే నెలరోజుల్లో 6 లక్షల ఫామ్ పాండ్స్ తవ్వకం పనులు పూర్తిచేయాలన్నారు. ఫిజియో మీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు భూగర్భజలమట్టం జిల్లా యంత్రాంగం పరిశీలించి అందుకుతగ్గ చర్యలు చేపట్టాలన్నారు.
ఒకప్పుడు గంటల తరబడి కరెంటు కోతలు, పవర్ హాలీడేలతో పంటలు ఎండిపోయి రైతులు పడ్డ ఇబ్బందులు, క్రాప్ హాలీడేలు ప్రకటించిన దుస్థితి ఉండేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. పవర్ హాలీడేలతో ఫ్యాక్టరీలు మూతబడి కార్మికులు ఉపాధి కోల్పోయిన దయనీయస్థితి ఉండేదని, అప్పటి ప్రభుత్వ నిర్వాకాన్ని, నిరంతర విద్యుత్ సరఫరాతో ఇప్పటి ప్రభుత్వం కలిగించిన మేలుపై ప్రజలు బేరీజు వేస్తున్నారని, దీనిపై మరింత చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
జూన్ 8న ‘మహా సంకల్పం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, రాబోయే మూడేళ్లలో మరింత ఉత్సాహంగా, ఉద్యమ స్ఫూర్తితో కలసి కృషి చేయాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. దాదాపు 6126 మంది ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
No comments:
Post a Comment