కేంద్రమంత్రి, అధికారులతో సీఎం మూడు గంటలపాటు సమీక్ష
రాష్ట్ర విభజనతో అనేకవిధాల నష్టపోయామని, రైల్వే జోన్‌ను కోల్పోయామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా శనివారం సీఎంఓకు వచ్చిన రైల్వే మంత్రి శ్రీ సురేష్ ప్రభు, అధికార బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.
తమ తక్షణ ప్రాధాన్యం రైల్వే జోను ఏర్పాటేనని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రైల్వేజోను ఏర్పాటు వల్ల స్థానికులకు ఉద్యోగాలు లభించటంతో పాటు, రాష్ట్రానికి అనేక ప్రయోజనాలుంటాయన్నారు. రాజధాని అమరావతిని కలుపుతూ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లను నడపాలని ఆయన విజ్ఞప్తిచేశారు. పుష్కరాల సందర్భంగా రైలు స్టేషన్ల సుందరీకరణకు, ప్రయాణీకులకు సదుపాయాల కల్పనకు బీఆర్టీఎస్ రోడ్డు వెడల్పు చేయాల్సి ఉందని, అందుకోసం రైల్వే భూమి అవసరమని, అడిగిన భూమిని తమకు కేటాయించాలని ముఖ్యమంత్రి రైల్వే మంత్రిని కోరారు. పుణ్యక్షేత్రాలున్న రైల్వేస్టేషన్లు పుష్కరాల సందర్భంగా ప్రయాణీకులతో కిటకిటలాడతాయని, అందువల్ల స్టేషన్లను ఆధునీకరించాలని, సుందరీకరణకు,సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
నవ్యాంధ్ర రాజధానికి అమరావతికి విజయవాడ, గుంటూరులతో కలుపుతూ రైల్వేలైను నిర్మించాలని విజ్ఞప్తిచేశారు. అనంతపురం, రాయలసీమ జిల్లాల నుంచి రాత్రివేళ బయలుదేరి ఉదయమే విజయవాడ చేరుకునేలా వీలయినంత త్వరలో ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని ముఖ్యమంత్రి కోరారు.
రాజధానిలో పనిచేయనున్న ఉద్యోగులకు సదుపాయంగా ఎంఎంటీఎస్ రైలు వ్యవస్థను రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరారు. విజయవాడ-అనంతపురానికి మలుపులు లేకుండా నేరుగా నిర్మించ తలపెట్టిన రోడ్డు మార్గం పక్కనే అనంతపురానికి రైల్వే లైను నిర్మించాలని కోరారు. రాయలసీమలోని నాలుగుజిల్లాలకు ఈ రైలుతో అత్యంత ప్రయోజనం ఉంటుందని, అతి తక్కువ సమయంలో రాయలసీమవాసులు నూతన రాజధానికి రావటానికి వీలవుతుందని చెప్పారు.
హైస్పీడు రైళ్లు విశాఖ-చెన్నయ్, అమరావతి-బెంగళూరు మధ్య నడపాలని కోరారు. రైల్వే శాఖ నిర్మించతలపెట్టిన 3వ రైల్వే లైను త్వరగా నిర్మించాలని, గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనులను వేగవంతం చేయాలని కోరారు. రాజమండ్రిలో హెవలాక్ రైలు వంతెనను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రైల్వేమంత్రికి విజ్ఞప్తిచేశారు. పుష్కరాల సందర్భంగా నిర్వహించటానికి రైల్వే ప్రొటెక్షన్ బోర్డుకు సమర్ధులైన అధికారులను నిమయించాలని, తద్వారా గోదావరి పుష్కరాల సందర్భంగా తలెత్తిన సమస్యలు రాకుండా చూడాలని కోరారు. విశాఖ నుంచి రాయపూర్, నాగపూర్ మీదుగా కొత్తఢిల్లీ , ముంబై వెళ్లే రైల్వే లైన్లను హైస్పీడు రైళ్లు వెళ్లినా తట్టుకునేలా పటిష్టపర్చాలని చంద్రబాబు కోరారు. ఢిల్లీ నుంచి వేరొక మార్గం ఏర్పడితే వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా సులువవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
విశాఖ నుంచి ముంబై కారిడార్ ఏర్పడే అవకాశం ఉంటుందని వివరించారు. ఆగస్టులో కృష్ణా పుష్కరాల సందర్భంగా అన్ని రైలు స్టేషన్లను ఆధునీకరించి, ప్రయాణీకుల రద్దీని తట్టుకునేలా చేయాలని, వారికి వసతుల కల్పనకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రైల్వే మంత్రిని కోరారు.
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం పురోగతిపై రైల్వే శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సందర్భంగా సీఎం స్పందిస్తూ రాష్ట్రంలో ప్రాధాన్యతా క్రమంలో రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని కేంద్రమంత్రి సురేష్ ప్రభును కోరారు.
కేంద్రమంత్రి సురేష్ ప్రభు స్పందిస్తూ ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్టు ఏర్పాటు చేద్దామని ప్రతిపాదించారు. తగిన ప్రణాళికను సిద్ధంచేయాలని కోరారు. తనను రాజ్యసభకు ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైల్వేమంత్రి సురేష్ ప్రభు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రాష్ట్ర రథసారథి చంద్రబాబుకు రుణపడివుంటానని, ఏపీ అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యతనిస్తానని స్పష్టంచేశారు. కలకత్తా-చెన్నై హై స్పీడు రైలు, సమీప భవిష్యత్తులో అమరావతి-బెంగళూరు హైస్పీడు రైలు మంజూరు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో లాజిస్టిక్ హబ్ అవుతుందని, ఎగుమతులు, దిగుమతులకు కేంద్రమవుతుందని, పోర్టులు, ఎయిర్ పోర్టులను కలుపుతూ రైల్వే లైన్లను నిర్మిస్తామని, ఇందుకు సర్వే చేస్తామని తెలిపారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై కోరినప్పుడల్లా ముఖ్యమంత్రికి వివరించాలని రైల్వే అధికారులను మంత్రి సురేష్ ప్రభు ఆదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీని, తమను పలుమార్లు కలిశారని, ఈరాష్ట్రాభివృద్ధికి ఆయన పడుతున్న తపన చూసి ఆశ్చర్యం వేస్తున్నదని ప్రశంసాపూర్వకంగా అన్నారు.
రైల్వే శాఖాపరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామన్నారు. హైస్పీడు రైళ్లను ప్రవేశపెడతామని చెప్పారు. డైనమిక్ లీడర్ సురేష్ ప్రభు అని ఆయన రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, ఆవేదనను అర్ధంచేసుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి, ఇటీవల తిరిగి రాజ్యసభకు ఎన్నికైన శ్రీ వైఎస్ చౌదరి, రాష్ట్ర మంత్రి డా. కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని నాని, రాయపాటి సాంబశివరావు, కొనకళ్ల నారాయణ, మాగంటి బాబు, నిమ్మల కిష్టప్ప, ముఖ్యమంత్రి కార్యాలయ సహాయ కార్యదర్శి శ్రీ అడుసుమల్లి రాజమౌళి, ఏడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సిహెచ్ కుటుంబరావు, ఐఏఎస్ అధికారి శ్రీ శ్యాంబాబు, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాబు ఎ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గుప్త, రైల్వే బోర్డు (ట్రాఫిక్) మెంబర్ మహ్మద్ జంషెడ్, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.